పోలవరం తుది అంచనా యాభై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు కోట్లు.

The final estimate of Polavaram is fifty-four thousand eight hundred and eleven crores.

పోలవరం సాగు నీటి ప్రాజెక్టు, పోలవరం జల విద్యుత్ కేంద్రాలను కలిపి ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండర్ లను జలవనరులశాఖ పిలిచింది. జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి రాష్ట్ర హై కోర్టులో వివాదం ఉంది. హైకోర్టులో ఇప్పటికే వాదనలు పూర్తయ్యి తీర్పు రిజర్వులో ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర జల వనరుల శాఖతో పీపీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి రివర్స్ టెండరింగ్ విధానానికి వెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడే న్యాయపరమైన ప్రతిబంధకాలు తలెత్తుతాయని ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని పీపీఏతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలు హెచ్చరించాయి. అయితే నేటి సమావేశంలో పోలవరం సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని రివర్స్ టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని వివరించనుంది. ఒకే ఒక్క సంస్థ బిడ్ ను దాఖలు చేసినందున రీటెండర్ గా పరిగణించాల్సి ఉంటుందని వివరించనుంది. ఈ రీటెండర్ లో రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆదా అయిందని పీపీఏకు రాష్ట్ర జల వనరుల శాఖ వివరించనుంది. న్యాయస్థానం తీర్పు వెలువడ్డాకే కార్యాచరణను ప్రకటిస్తామని పీపీఏకు రాష్ట్ర జల వనరుల శాఖ స్పష్టం చేయనుంది. న్యాయస్థానం తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఉటుందని పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయనుంది. అయితే దీనిపై పీపీఏ స్పందన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఏపీ జల వనరుల శాఖ నేడు పోలవరం ప్రాజెక్టు అథారిటీతో హైదరాబాద్ లో భేటీ కానుంది. సమావేశంలో సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణ పనుల కార్యాచరణను గురించి ప్రశ్నించనుంది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో నిర్ణయం తీసుకున్నప్పుడు వద్దని వారిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ లేఖ రాసింది. పీపీఏతో సహా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా రివర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దంటూ సూచించింది. తరువాత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. రివర్స్ టెండర్ విధానంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా సంస్థ ఒక్కటే పాల్గొన్నప్పటికీ పోలవరం సాగు నీటి ప్రాజెక్టులో రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల మేర ఆదా అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు పోలవరం తుది అంచనాల పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ న్యూఢిల్లీలో రేపు భేటీ కానుంది. ఇప్పటికే పలు దఫాలు ఈ సమావేశాలు జరిగాయి. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర జల సంఘం, పోలవరం తుది అంచనాలు యాభై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా సంఘం సమ్మతి తెలిపింది. దీన్ని ఆమోదించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఫైలు పంపింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఈ తుది అంచనాలోని భూ సేకరణ సహాయ పునరావాసం వ్యయంపై ఆర్థిక శాఖ కొర్రీలు వేస్తూ వస్తోంది. అటు ఇదే సమయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ రెండు వేల పద్నాలుగుకు ముందు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి ఆడిట్ నివేదికను కోరుతోంది. ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం సాగు జల విద్యుత్ కేంద్రాల రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. ఈ రివర్స్ టెండరింగ్ లో ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల మేర ఆదా అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంటే పోలవరం తుది అంచనా యాభై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు కోట్లకు చేరుతుంది. దీనిపైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమాచారం ఇవ్వాల్సి ఉంది.

Leave a Response